Ad Code

Responsive Advertisement

రంగమార్తండ విశ్లేషణ

 రంగమార్తండ (సేకరణ) 

కృష్ణవంశీ లోని దర్శకుడు కొత్తగా పుట్టాడు, ఇదొక నిశ్శబ్ద విస్ఫోటనం..!!

రాఘవరావుకు (ప్రకాష్ రాజ్) సన్మానం చేసి రంగమార్తండ బిరుదును ప్రదానం చేసే సమయంలో
ఆయన మాట్లాడుతూ ఇక నాటకాలు మానేస్తున్నానని చెబుతాడు "నిష్క్రమణ కూడా పట్టాభిషేకమే" అంటాడు గురూజీ, ఆ ఒక మాట, ఆ ఒక్క మాట సినిమా స్థాయిని ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్తుంది...

దాదాపు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో నటించి, గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన బ్రహ్మానందం వేరు,  ఈ సినిమాలోని బ్రహ్మానందం వేరు, ముమ్మాటికీ వేరు,  అన్ని వందల సినిమాల్లో నవ్వించిన ఆయన ఈ సినిమాలో ఏడిపిస్తాడు, కన్నీళ్ళు కూడా చాలా ఇష్టంగా వస్తాయి ఆయన నటనను చూస్తే...

"కళాకారుడు ఎప్పుడూ ఒక తరం ముందుంటాడు" అని మరొక సీన్ లో చెప్పే డైలాగ్ అద్భుతం అనిపించింది, సినిమా చూసి బయటకు వచ్చాను, అసలు సినిమా గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు...చాలా డిస్టర్బ్ చేసింది నన్ను, చాలా రోజుల తర్వాత పాత ప్రకాష్ రాజ్ ను చూశా, రమ్యకృష్ణ గారి నటనను చూస్తే అసలు ఇంత గొప్ప నటులను ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడో ఎవరికోసమో వెతుకుతున్నాం కదా అనిపించింది 

ప్రకాష్ రాజ్ - బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి, ఇది నా పాత్ర కాదు ఇది నా జీవితం అని ఫీలై చేశారేమో అనిపిస్తుంది  అసలు నట విధ్వంసం అంటే ఏంటో ఈసినిమాలో ప్రకాష్ రాజ్ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ చూస్తే అర్థమవుతుంది

కంట్లో కన్నీళ్ళు ఉన్నంతవరకే కాదు కట్టె కాలేవరకూ ఇలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు కదా, ఇలాంటి భార్య ఉంటే చాలు కదా అనిపిస్తుంది, మీరొక్కరే సినిమాకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ భార్య మీకు గుర్తొస్తుంది గురూజీ ఆమె మీద గౌరవం రెట్టింపవుతుంది... 

నటరాజు తాండవమాడితే రంగమార్తండ నవరసాల సమ్మిళితమైన నటనను ప్రదర్శిస్తే రంగ మార్తండ  కన్నీళ్ళు ఇంకిపోయి కరడుగట్టిన మృగం లా మారిన మనిషి చేత కన్నీటి ఊటను వెలికి తీస్తే రంగమార్తండ 

"నాకు ముక్తిని ప్రసాదించరా రాఘవా" అని బ్రహ్మానందం గారు అంటుంటే మనసు చాలా బరువెక్కింది, చక్రి పాత్ర ఆయన తప్ప మరే ఇతర నటుడూ చేయలేని పాత్ర, ప్రకాష్ రాజ్ లేకుండా రంగమార్తండ ను ఊహించుకోగం కానీ బ్రహ్మానందం లేని రంగమార్తండ సంపూర్ణం కాదు...

థియేటర్ నుంచి బయటికొచ్చాక నా గొంతు మారిపోయింది, ఇలాంటి సినిమాలు దశాబ్దానికి ఒకటో రెండో వస్తాయి, మనసులో నాటుకుపోతాయి, ఏ ఐదేళ్ళకో, పదేళ్ళకో గుర్తొస్తే అప్పుడు కూడా గుండె చెమర్చుతుంది గురూజీ...

ఒక శంకరాభరణం సినిమా చూసినప్పుడు, మాతృదేవోభవ చూసినప్పుడు, ఆనలుగురు సినిమా చూసినప్పుడు, మిథునం చూసినప్పుడు మనం ఎలాంటి అనుభూతికి లోనవుతామో అచ్చంగా అలాంటి అనుభవమే ఈ సినిమా చూస్తున్నంత సేపు కలుగుతుంది 

ఇదొక స్లో పాయిజన్, అసలేముంది ఈసినిమాలో అని అనిపిస్తుంది, అరె ఎంత అద్భుతమైన సినిమారా ఇది అని అప్పుడే అనిపిస్తుంది, ఒక కొత్త నటుడు కూడా కృష్ణవంశీ చేతిలో పడితే కోహినూర్ వజ్రంలా మారతాడు అనడంలో అతిశయోక్తి లేదు...

ఈ సినిమా భయపెడుతుంది, బాధపెడుతుంది, ఎలా బ్రతకాలో చెబుతుంది, భద్రతను, బాధ్యతను గుర్తుచేస్తుంది, ఉన్నదంతా పిల్లలకు పంచిపెడితే చివరిరోజుల్లో ఎలా అనే ఆలోచన కలిగిస్తుంది, సగటు మనిషిలో అంతర్మధనం మొదలయ్యేలా చేస్తుంది...

బ్రహ్మానందం జాయిన్ అయిన హాస్పిటల్ లోని రూమ్ ను చూస్తే మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుని, మనం భరించిన ఒంటరితనమంతా ఆ సీన్ లో కనిపిస్తుంది, నిశ్శబ్దం ఎంత భయకరమైనదో, అసలు నిశ్శబ్దం కంటే చావు ఎంత మేలో తెలుస్తుంది...

సిందూరం సినిమా టైం లోని కృష్ణవంశీ ని చూశాను గురూజీ...!! రంగమార్తాండ

Post a Comment

0 Comments