Ad Code

Responsive Advertisement

ఆపద మొక్కులవాడా...!!

 ఆపద మొక్కులవాడా...!!


మనం అనుకున్న పనులు అన్నీ కూడా సవ్యంగా జరిగి పోవాలని ఆ భగవంతుని మనం ఎన్నెన్నో మొక్కులు మొక్కు కుంటూ ఉంటాము. అలా మనం మొక్కుకునే మొక్కులు ఎలా ఉంటాయో, ఆ మొక్కులను మనం చెల్లించే విధానాల గురించి ఇప్పుడు మనం తెలుసు కుందామా…

అసలు ఈ మొక్కు అన్నమాట ఎక్కడ, ఎందుకు ఎప్పుడు ప్రారంభం అయిందో అన్న విషయాన్ని పరిశీలిస్తే…. ‘తరిగొండ వెంగమాంబ’ గారు ‘వేంకటాచల మహాత్మ్యము’ అని ఒక గ్రంథాన్ని రచించారు.  ఆ తల్లి ఆ గ్రంథ రచనను వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తోనే వ్రాశారు. 

వేంకటేశ్వర స్వామివారు ఈ భూమండలం మీద అవతారాన్ని స్వీకరించిన తర్వాత ఒకసారి లక్ష్మీదేవి స్వామిని అడిగింది….”ఎందుకు మీరు ఈ భూమండలం మీద ఇన్ని అష్టకష్టాలు పడుతూ ఉండడం? అలాగే మీరు కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం మీకు ఒక పెద్ద విషయం కాదు. 

నేను ఆదిలక్ష్మిని,  నేను తలచుకుంటే కుబేరుని అప్పు తీర్చడం ఏమంత గొప్ప విషయం కాదు. కాబట్టి కుబేరుని అప్పు తీర్చేద్దాం. మళ్ళీ మనం   శ్రీవైకుంఠానికి చేరుకుందాం!” అన్నది. 

అందుకు స్వామి ఒక చిరునవ్వు నవ్వి “ఇక్కడ నేను అప్పు తీర్చి వైకుంఠము చేరుకోవడం ఏమంత పెద్ద విషయం కాదు! కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవులు ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంటారు.

 ‘తాము చేసేది పాపం అని తెలుసు. 

ఆ పాపం చేయడం వల్ల దాని ఫలితంగా దుఃఖం వస్తుంది అని తెలుసు. తెలిసి కూడా దుఃఖ కారకమైన పాపాన్ని చేయకుండా నిగ్రహ శక్తితో ఉండలేరు మనుష్యులు. దానికి కారణం ఆ కలిపురుషుడే.

 దుఃఖమునకు పాపం కారణం అని తెలిసి కూడా పాపం చేయిస్తూ ఉంటే ఆ పాపం వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ జనులు తమని  ఆదుకోవడం కోసం వాళ్లు నన్ను పిలుస్తారు. వాళ్ళు పాపం చేసేటప్పుడు ఫరవాలేదులే ఏదో అవసరానికి ఒక తప్పేకదా అని చేసేస్తారు. 

అప్పుడు నేను అక్కరలేదు- వారికి!  కానీ తాము చేసిన ఆ పాపము యొక్క ఫలితం వారిని కష్టాల పాలు చేసినప్పుడు, నష్టాలు వచ్చి నప్పుడు వాడు  ‘గోవిందా’ నాకు నీవే దిక్కు స్వామి అంటాడు.     

‘ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా!’ అని చేతులెత్తి మొక్కుతూ ఉంటాడు. ‘ఆపద మ్రొక్కుల వాడా, అనాధ రక్షకా నన్ను కాపాడు తండ్రీ!’ అని పిలుస్తాడు.

ఇక్కడ ఆపద అన్న మాటకి అర్థం ఏమిటంటే.. మన ప్రయత్నం చేత పైకి రావడం సాధ్యం కానప్పుడు మనిషికి కలిగే ఇక్కట్లనే ఆపదలు అంటారు. ఆ కష్టంలోంచి మన ప్రయత్నంతో మనం పైకి రాలేము. అలా ఇరుక్కు పోయినప్పుడు ఆపద మ్రొక్కుల వాడా అని పిలుస్తాం. ఈ ఆపద నుంచి నన్ను రక్షించు స్వామి అని మొక్కులు మొక్కు కుంటారు. 

ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మొక్కులు మొక్కు కుంటారు. ఒకరు తల నీలాలు ఇస్తాను అంటాడు. ఒకడు కొండకు నడిచి వస్తాను అంటాడు. ఒకడు స్వామీ నీ హుండీలో డబ్బులు వేస్తాను అంటాడు. అలా మొక్కుకొనే వీటినే మొక్కులు అంటారు. కానీ ఇవన్నీ వేంకటేశ్వర స్వామి దృష్టిలో  మొక్కులనేవి వ్యాపారం కానే కాదు. 

తను చేసిన పాపం వలననే దుఃఖం కలుగుతోంది అని మానవులు తెలుసు కోవాలి. అలా తెలుసుకొని మానవులు పరమేశ్వరుణ్ణి పిలిస్తే నేను ఆదుకోక పోతే ఎవరు ఆదుకుంటారు అని ఆ వేంకటాచలం పై వెలసి ఉన్నాడు ఆ భగవంతుడు ఈ కలియుగంలో!

ఎవడు ఎక్కడ ఉండైనా లోలోపల మనసులో నైనా తలుచుకొంటూ నన్ను పిలిచినా నాకు వినపడు తుంది. నేను ఆ పిలుపు విని వాడిని ఆపదలోంచి ఉద్ధరిస్తాను. అలా ఆపద తీరిన వాడు అందుకు బదులుగా వాడు నా దగ్గరికొచ్చి మొక్కు తీరుస్తాడు. 

మనిషి పాపాల వలన దుఃఖాలు కలిగి నప్పుడు ఆ దుఃఖముల నుంచి బయట పడడానికి ‘ఆపద మొక్కుల వాడా!’ అని పిలిచి మొక్కులు మొక్కి ఆ మొక్కు తీసుకువచ్చి నా హుండీలో వేస్తాడు. అలా వేసిన డబ్బు జనుల ఉద్ధరణ కొరకు, వారి అవసరాలను తీర్చడానికి అధికారులతో పంపిస్తాను.

 ఇలా వచ్చిన ఆ డబ్బులతో నా పేరుమీద ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. నిత్యాన్నదానం, ఆరోగ్యం కొరకు వైద్యశాలలు, పశుపక్ష్యాదుల కోసం, బాటసారుల కోసం బాసటగా నిలవడం కోసం చెట్లు నాటుతారు. 

ఎన్నో ప్రయోజనాల కోసం వినియోగించ బడుతుంది ఆ డబ్బు. 

అలా భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి హుండీలో వేసిన డబ్బును మంచి కార్యక్రమాల కోసం వాడడం వల్ల మొక్కు తీర్చిన వాడి మొక్కు సఫలం అవుతుంది అన్న మాట.

అంటే పాపం వలన దుఃఖం వచ్చింది అని ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇక వాడు పాపం జోలికి వెళ్ళకుండా ఉండడం నాకు ఇష్టం. అది వేంకటేశ్వరుడి యొక్క అభిప్రాయం. 

మొక్కు అంటే ఆపత్కాలం నందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు. ‘ఈశ్వరా! నన్ను ఈ ఆపదనుంచి బయట పడెయ్యి. నేను ఒక రూపాయి హుండీలో వేస్తాను!’ అన్నావు. ఆపద  నుంచి గట్టున పడిపోయావు. ఒకసారి ఆపద వచ్చి తీరిన తర్వాత బుద్ధిని దిద్దుకోవాలి. నేను హుండీలో రూపాయి వేస్తాను అనుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు వెళ్తుంటే వాళ్లకి రూపాయి ఇచ్చి పంపించడం తగదు. 

నేను హుండీలో వేస్తాను అన్న మాటకి అర్థం నీవే తిరుపతికి వచ్చి వేంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి ‘స్వామీ! నా మొక్కు ప్రకారం నేను అనుకున్నది జరిగింది.

నన్ను జీవితాంతం ఇలాగే ఆశీర్వదించు తండ్రి!’ అని ప్రార్థన చేసి ఆ రూపాయిని పట్టుకెళ్ళి హుండీలో నువ్వే వేయాలి. అప్పుడే నీ మొక్కు పూర్తి అవుతుంది. కనుక మనమే క్షేత్రమునకు వెళ్ళి ఎవరి మొక్కును వారే తీర్చుకోవాలి.

మొక్కే వాడు ఏ భాష వాడైనా, ఏ మతం వారైనా, ఏ కులం వాడైనా స్వామి వారికి తేడా ఉండదు. మొక్కుకున్న వ్యక్తి ప్రధానంగా ఇక పాపం వైపు దృష్టి పోకుండా చూసుకోవాలి. ఎవరైనా మనకు మేలు చేస్తే మనం వారి వద్దకు వెళ్లి కృతజ్ఞత చెప్తాం కదా! అలాగే మనం ఆపద నుంచి విముక్తిని పొందిన తర్వాత ఆ భగవంతునికి కృతజ్ఞతా సమర్పణం చేసి రావడం, మొక్కు తీర్చి రావడం ఎంతో ముఖ్యమైన అంశం. 

మొక్కు తీర్చుటంలో ఇంటిల్లిపాదీ వచ్చి కృతజ్ఞత చెప్పక పోతే కృతఘ్నులం అయిపోతాం అని తెలుసుకొని అందరూ వెళ్ళడం వల్ల అందరి సంస్కారం బల పడుతుంది. అందరికీ శుభం చేకూరుతుంది.

అనుకున్నది జరిగినప్పుడు మొక్కు తీర్చుకోవడానికి వెళ్లే సమయంలో నీ పని జరగడానికి సహకరించిన వారిని కూడా విశాల హృదయంతో భగవంతుని దర్శనానికి తీసుకుని వెళ్ళవచ్చు. అలా వీలు కాకుంటే నువ్వు ఒక్కడివైనా వెళ్ళి మొక్కు చెల్లించి దర్శనం చేసుకుని రావాలి. 

మొక్కును సరైన సమయంలో తీర్చుకున్నప్పుడే నీకు భగవంతుడి పైనున్న భక్తి, కృతజ్ఞతలకు అర్థం ఉంటుంది....స్వస్తి. 

 దయచేసి మీ మీ బంధుమిత్రులకి షేర్ చెయ్యండి ఆ వేంకటేశ్వరుని దర్శించు కొండి 

Post a Comment

0 Comments